అది స్వర్గమో, నరకమో తెలియదు. ఆ ప్రదేశము అంతా సాధారణంగా ఉంది. అక్కడొక ఆసనంపై రావణుడు కూర్చుని ఉన్నాడు. రావణుడి ముఖంలో కోపం కన్పిస్తోంది. ఇంతలో ఒక భటుడు వచ్చి, ‘‘ప్రభూ నారదుల వారు వచ్చారు!’’ అన్నాడు.
ప్రవేశపెట్టమన్నట్లు చూశాడు రావణుడు.
లోపలికి వచ్చిన నారదుడికి నమస్కరించి, ఆసనం చూపాడు రావణుడు.
నారదుడు ఆసనంపై కూర్చున్నాడు.
‘‘రావణా నీకు మళ్లీ కోపం వచ్చినట్లున్నది!’’ అన్నాడు నారదుడు.
‘‘కోపం రావటంలో తప్పేమున్నది. మునీంద్రా? ప్రతి దసరాకు నా ప్రతిరూపాన్ని ఎందుకు దహనం చేయవలె!’’ ప్రశ్నించాడు రావణుడు.
‘‘దుర్మార్గుడవైన నిన్ను ఓడించిన రోజును గుర్తు చేసుకుంటూ దసరా రోజున నీ ప్రతిరూపాన్ని దహనం చేస్తున్నారు కదా!’’ అన్నాడు నారదుడు .
‘‘నేను దుర్మార్గుడినా, సీతను చెరపట్టుట మినహా మరొక్క దుర్మార్గమును ఏదైనా చేసితినా? ముల్లోకాలను నేను జయించాను. కాని లంకకు మాత్రమే పరిమితిమై జీవించాను. సీతను చెరపట్టాను కాని ఎందుకు? నా సోదరి శూర్పణఖకు రాముడు చేసిన అవమానానికి ప్రతీకారంగానే సీతను ఎత్తుకొని వచ్చితిని. కాని ఏనాడైనా ఆమెను తాకనైనా తాకలేదు కదా! నా బందీగా ఉన్నాసరే సీతను నేను గౌరవంగానే చూశాను.
రాజులకు ఉచితమైన రీతిలోనే రాముడు నన్ను ఓడించి, సీతను స్వీకరించాడు. ఇంతమాత్రానికే నా ప్రతిరూపాన్ని ప్రతి దసరాకు కాల్చవచ్చునా?’’ప్రశ్నించాడు రావణుడు .
నారదుడు మాట్లాడలేదు!
‘‘సీతను బందీగా చేసినందుకే నా ప్రతిరూపాన్ని కాల్చుతున్నారు! మరి ద్రౌపది వస్త్రాపహరణ చేసిన దుశ్శాసనుడిని ఏం చేస్తున్నారు! ఎక్కడైనా దిష్టిబొమ్మ కాల్చారా? లేక రాళ్లతో కొట్టారా?’’ మళ్లీ ప్రశ్నించాడు రావణుడు.
రావణుడి మాటలకు నారదుడు ఆశ్చర్యపోయాడు. నిజమే రావణుడి కన్నా దుశ్శాసనుడే చాలా దుర్మార్గుడు! తల్లిలా చూడవలసిన వదిన ద్రౌపది జుట్టు పట్టి నిండుసభలోకి ఈడ్చుకొనివచ్చి వస్త్రాపహరణం చేశాడు! అంత దుర్మార్గుడిని బతికుండగానే నిప్పుపెట్టి కాల్చేయాలి! కాని దుశ్శాసనుడిని ఒదిలేసి రావణుడి ప్రతిరూపాన్ని కాల్చుతున్నారు!
ఇంతలో తాను వచ్చిన పని గుర్తుకొచ్చింది!
‘‘రావణా! నీ ఆవేదన సమంజసమైనదే! నీకు నావద్ద ఎలాంటి సమాధానమూ లేదు! అయితే నీకో విషయం చెప్పాలని వచ్చితిని!’’ అన్నాడు నారదుడు.
‘‘ఏమిటో సెలవ్వియ్యండి మునీంద్రా!’’ అన్నాడు రావణుడు.
ఈసాది దసరా పండగలో నీ ప్రతిరూపంతో పాటు బొద్దింక ప్రతిరూపాన్ని కూడా దహనం చేశారు!’’ అన్నాడు నారదుడు.
రావణుడు పెద్దగా నవ్వాడు.
‘‘ఎందుకు నవ్వుతున్నావు?’’ అడిగాడు నారదుడు.
‘‘నాకు బొద్దింకలకు ఏదైనా సారుప్యత ఉన్నదేమో! బొద్దింకలు ఎవరి భార్యనైనా చెరబట్టాయా మునీంద్రా!’’ నవ్వుతూనే అడిగాడు రావణుడు.
‘‘లేదు! లేదు! భారతదేశంలో బొద్దింకలు ప్రస్తుతం ప్రజాస్వామ్యాన్ని కాపాడే పనిలో ఉన్నాయి! ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నాయి! భారత రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాడుతున్నాయి! పదమూడు కోట్ల మంది ప్రజల ఓట్లను దొంగిలించిన వారిని రాజీనామా చేయమని ధర్నాలు చేస్తున్నాయి! శాంతియుతంగా బొద్దింకలు చేస్తున్న పోరాటం ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్నది! బొద్దింకలు చేస్తున్న పోరాటంతో కొందరికి నిద్ర కరువైంది! కొందరి ఆధికార పీఠాలు కదలిపోతున్నాయి! అందుకే బొద్దింకలపై దాడులు చేసి, కేసులు పెట్టె, అక్కసు తీరక ఇలా దసరా ఉత్సవాలలో దహనం చేస్తున్నారు!’’ వివరించాడు నారదుడు.
‘‘బొద్దింకలు అంత బలమైన పోరాటం చేస్తున్నాయా?’’ అడిగాడు రావణుడు.
‘‘బొద్దింకలు మాత్రమే కాదు! దేశంలోని యువత అంతా తిరగబడుతున్నది!
దేశంలోని అనేక ప్రజాస్వామిక శక్తులు ఇందులో కలిసి పోరాడుతున్నాయి! గత కొన్నేండ్లుగా సోషల్ మీడియాలో అనేకరకాల అబద్దాలు, ప్రచారం చేసి, యువతను నిస్తేజం చేశారు! కాని ఇప్పుడు యువతకు వాస్తవమేమిటి, అబద్ధమేమిటి? తెలిసిపోయింది! భ్రమలు తొలగిపోయాయి! అందుకే అదే సోషల్ మీడియా ద్వారా పోరాటాలు రూపొందించుకున్నారు! ఆ పోరాటాలను సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు చేరవేస్తున్నారు!’’ అన్నాడు నారదుడు.
‘‘అయితే భరత ఖండానికి మంచి రోజలు వచ్చాయన్న మాట’’ అన్నాడు రావణుడు.
‘‘అవును! మేల్కొన్న యువత పోరాటాలు చేస్తున్నది! అంతిమ విజయం సత్యానికే వస్తుంది! అయితే ఆ విజయం దక్కాలంటే పోరాటాలు జరగాలి. చెడు మీద మంచి తానంతట తానే గెలవదు! పోరాడితేనే గెలుస్తుంది! అది యుగధర్మం. ప్రతి యుగంలోనూ చెడుమీద మంచి పోరాడి గెలిచింది! భారతదేశంలో కూడా బ్రిటీషు వారిపై భారతీయులు పోరాడి స్వాతంత్ర్యం సాధించుకున్నారు! ఇప్పుడు కూడా అదే జరుగుతుంది!’’అన్నాడు నారదుడు.
రావణాంతరంగం
58 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026 | 3 నిమిషాల చదవడం






కామెంట్లు (0)