Magazines

నకిలీ ఖాతాలతో హనీట్రాప్‌

3 గంటల క్రితం

Honeytrap
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 2 నిమిషాల చదవడం

రూ.25.16 లక్షలు వసూలు

సైదాబాద్ పోలీసుల అదుపులో నిందితుడు


నవతెలంగాణ–చార్మినార్
హైదరాబాద్‌లో హనీట్రాప్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యువతుల పేర్లతో నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాలు సృష్టించి, పరిచయాలు పెంచుకుని, వ్యక్తిగత చిత్రాలు, వీడియోలతో బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై కొండభట్లుల పవన్ కుమార్‌ (23)ను సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం రూ.25.16 లక్షలు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుని నుంచి మూడు మొబైల్ ఫోన్లు, ఒక హెచ్‌పీ ల్యాప్‌టాప్, 16 జీబీ పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్‌ జోన్‌ డీసీపీ ఖేర్‌ కిరణ్‌ ప్రభాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు యువతుల ఫొటోలు ఉపయోగించి నకిలీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను నిర్వహించేవాడు. ఇతరులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌‌లు పంపి యువతిగా పరిచయం చేసుకుంటూ క్రమంగా వ్యక్తిగత సంభాషణలు సాగించేవాడు. అనంతరం అసభ్యకర చిత్రాలు పంపి, ఎదుటివారి వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు సేకరించేవాడు. తర్వాత యువతికి సోదరుడిగా పరిచయం చేసుకుంటూ బాధితులను ఫోన్‌, వాట్సాప్‌, సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదించి వారి చిత్రాలు, వీడియోలను బయటపెడతానని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు.

ఈ క్రమంలో నిందితుడు బెదిరింపుల ద్వారా రూ.18 లక్షలు వసూలు చేయడంతో పాటు, పెట్టుబడులపై అధిక రాబడి వస్తుందని నమ్మించి మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రూ.7.16 లక్షల మేర మోసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు గుర్తుతెలియని బాధితుల నుంచి వరుసగా రూ.6.8 లక్షలు, రూ.7 లక్షలు వసూలు చేశారు. ఈ వ్యవహారం లో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. డిప్లొమా చదివిన సమయంలో పరిచయమైన స్నేహితుడిని కూడా ఇదే తరహాలో బెదిరించి రూ.4 లక్షలు వసూలు చేసినట్టు పోలీసులు వివరించారు. నిందితుడు గతంలో బషీర్‌బాగ్‌లోని డీజీ లోన్స్‌ స్టార్‌ పవర్జ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ సంస్థలో పనిచేసినట్టు, జీతం అడ్వాన్స్‌గా తీసుకున్న రూ.16 వేలతో సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు.

విచారణలో నిందితుడు 13 నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌, 14 ఫేస్‌బుక్‌ ఖాతాలతో పాటు రెండు వాట్సాప్‌ ఖాతాలు, మూడు మొబైల్‌ నంబర్లు ఉపయోగించినట్టు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, కర్నాటక, పంజాబ్‌ తదితర ప్రాంతాలకు చెందిన 24 మంది, దుబాయ్‌, టర్కీ, పాకిస్థాన్‌, కెనడా తదితర దేశాలకు చెందిన తొమ్మిది మంది బాధితులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. చార్మినార్‌ జోన్‌ డీసీపీ ఖేర్‌ కిరణ్‌ ప్రభాకర్‌, అదనపు డీసీపీ ఎండీ మజీద్‌, సైదాబాద్‌ డివిజన్‌ ఏసీపీ సోమ వెంకట్‌రెడ్డి పర్యవేక్షణలో కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిపారు. సైదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ బి.చంద్ర మోహన్‌ దర్యాప్తులో పాల్గొన్నారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్